నాగార్జునసాగర్ అసలు చరిత్ర
చరిత్ర ప్రజలకు చెప్పని నిజాలు ..ఎన్ని అడ్డంకులు తర్వాత నాగార్జున సాగర్ నిర్మాణం జరిగిందో తెలుసా ….!
*Chandu*
ఇక్కడ ఒక జలాశయము కట్టాలనే ఆలోచన బ్రిటిష్ పరిపాలకుల కాలంలోను అనగా నైజాము పరిపాలన కాలములోనే 1903 లోనే వచ్చింది. చివరికి భారత దేశ ప్రథమ ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా 1955 డిసెంబరు 10 నాడు పునాది రాయి పడింది. భారత దేశ రెండవ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి చేతుల మీదుగా 1967 లో కుడి, ఎడమ కాలవలోనికి నీటి విడుదల జరిగింది.
గతంలో ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాకులు, శాతవాహనులు పరిపాలించేవారు. ఆకాలంలో కట్టబడి అనేక బౌద్ధ స్థూపాలు ఇతర కట్టడాలు ఈ జలాశయములో మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. వాటి పరిరక్షణకు వాటిలో చాల వాటిని యదాతదంగా పెకలించి జలాశయం మధ్యలో నెలకొని వున్న నాగార్జున కొండపైకి తరలించి అక్కడ వాటిని యదాతదంగా ఏర్పాటు చేయడము జరిగింది. అక్కడ ఒక మ్యూజియం కూడా నిర్మించి అందులో ఆనాటి అనేక వస్తువులను ప్రదార్శనకొరకు పెట్టారు.
ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వము కృష్ణానది నీటిని తమిళ దేశానికి తీసుకుపోవుటకు కృష్ణా పెన్నా నదులను సంధించుటకు “కృష్ణా-పెన్నార్ ప్రాజెక్ట్”ను బృహత్తర ప్రణాళికగా తలపెట్టింది. ఇది తెలిసి ముక్త్యాల రాజా అనబడు వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ ఆంధ్ర ప్రాంతములోని తొమ్మిది జిల్లాలలో ప్రతివూరు తిరిగి (38వేల మైళ్ళు) నాగార్జునసాగర్ నిర్మాణానికి సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపారు. ఆ సమయములోనే డా. కె. ఎల్. రావు ద్వారా పూర్వం హైదరాబాదు నవాబు ఆలీయవార్ జంగ్ కృష్ణా నదిపై పరిశోధన చేయించి ప్రణాళికలు తయారు చేయించాడని విన్నాడు. అన్వేషించి ఆ రిపోర్టులు సాధించాడు. ‘నందికొండ ప్రాజెక్ట్ స్వరూప స్వభావాలు తెలుసుకోవడానికి స్వయముగా క్షేత్రాన్వేషణకు పూనుకున్నాడు. ఎన్నో వ్యయప్రయాసలకు లోనై మాచెర్ల దగ్గర నదీలోయను దర్శించాడు. స్వంత ఖర్చుతో నెలనెలా జీతాలు ఏర్పరిచి మైసూరు ప్రభుత్వ రిటైర్డు ఛీఫ్ ఇంజినీరు నరసింహయ్య, పి. డబ్ల్యు.డి రిటైర్డు ఇంజినీరు గోపాలాచార్యులు ద్వారా అంచనాలు, ప్లానులు తయారు చేయించాడు.
నాటిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ శంకుస్ధాపన చేసారు
మద్రాసు ప్రభుత్వము వారి ప్రయత్నాలకు అన్నివిధములా అడ్డు పడింది. రాజా గారు కృష్ణా రైతుల వికాస సంఘము స్థాపించి కేంద్ర ప్రభుత్వముపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వము ఖోస్లా కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ పర్యటనలో నందికొండ ప్రస్తావన లేదు. రాజా ఎంతో నచ్చజెప్పి నందికొండ సందర్శన చేర్పించాడు. కానీ కమిటీ సభ్యులు నందికొండకు కార్లు, జీపులలో వెళ్ళుటకు అనువైన దారి లేదనే సాకుతో విషయమును దాటవేయుటకు ప్రయత్నించారు. రాజా వేలరూపాయలు ఖర్చు పెట్టి ఇరవైఇదు గ్రామాలనుండి ప్రజలను, స్వయంసేవకులను కూడగట్టి, వారము రోజులు రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసి, కార్లు వెళ్ళుటకు వీలగు దారి వేశారు. 1952లో ఖోస్లా కమిటీ నందికొండ డాం ప్రదేశము చూసి ప్రాజెక్టు కట్టుటకు ఇంతకన్న మంచి చోటు వుండదని తేల్చింది. విజయవాడ నుండి 260 మైళ్ళ పొడవునా ఖోస్లా కమిటీకి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రాజెక్ట్ ప్రాంతం పరిశీలించిన ఖోస్లా “ఇది భగవంతుడు మీకు ఇచ్చిన అమూల్యమైన వరం” అని తెల్పాడు.
ఖోస్లా కమిటీ రిపోర్టును తొక్కిపెట్టుటకు ఢిల్లీలో ప్రయత్నములు మొదలైనవి. రాజా ఢిల్లీ వెళ్ళి ప్రొఫెసర్ ఎన్.జి.రంగా, మోటూరు హనుమంతరావు, కొత్త రఘురామయ్య మొదలగు పార్లమెంటు సభ్యులను కలిసి, రిపోర్టును వెలికితీయించి దాని ప్రతులను అందరికి పంచిపెట్టి, ప్రణాళికా సంఘం సభ్యులందరిని ఒప్పించి సుముఖులు చేశాడు. ప్రణాళికా సంఘం ఖోస్లా కమిటీ సూచనలను 1952లో ఆమోదించింది. జలాశయ సామర్థ్యం 281 టి.ఎం.సి.గా సూచించింది. అదే సమయములో రాష్ట్ర ప్రభుత్వము కూలిపోయింది. రాష్ట్రములో గవర్నర్ (చందూలాల్ త్రివేది) పాలన ఆరంభమయింది. త్రివేది ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారిని ఖోస్లా కమిటీ రిపోర్టు ఆమోదించమని విజ్ఞప్తి చేశారు. చివరకు 1954 లో నాగార్జునసాగర్ నిర్మాణానికి ఆమోదముద్ర లభించింది. 1955 డిసెంబర్ 10న (మన్మధ నామ సంవత్సరం కార్తీక బహుళ ద్వాదశి నాడు) అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. అప్పటి హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి, బూర్గుల రామకృష్ణారావు, ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ సి.ఎం.త్రివేది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిర్మాణ సమయములో రాజా గారు యాభైరెండు లక్షల రూపాయిలు మాచింగ్ గ్రాంటుగా ఇచ్చారు. డ్యాము నిర్మాణం 1969లో పూర్తయింది. క్రెస్టు గేట్లను అమర్చే పని 1974లో పూర్తయింది.
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ముక్త్యాల రాజా కార్యదక్షతకు, దేశసేవాతత్పరతకు, నిస్వార్ధసేవానిరతికి గొప్ప ఉదాహరణ. ముఖ్యముగా సాగర్ ఆయకట్టు రైతులకు రాజాగారు బహుధా స్మరణీయులు. నార్ల వెంకటేశ్వర రావు మాటలలో “ఆయన అంతగా తపన చెందకపోతే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ మనకు సిద్ధించేది కాదేమో”. రాజా గారిని ప్రజలు “ప్రాజెక్టుల ప్రసాద్” అని పిలుచుకునేవారు.
బౌద్ధ అవశేషాలతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన నందికొండ, ప్రాజెక్టు నిర్మాణం తరువాత నాగార్జునసాగర్ గా ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మరింత స్థిరపడింది.

Comments
Post a Comment