కడప “అమీన్ పీర్ దర్గా” అంటే ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఎందుకో తెలుసా…!
కడప “అమీన్ పీర్ దర్గా” అంటే ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఎందుకో తెలుసా…!
అమీన్ పీర్ దర్గా (ఆస్థాన్-ఎ-మగ్దూమ్-ఇలాహి దర్గా)
తరాలు మారినా అవిచ్ఛిన్నంగా పరిఢవిల్లుతూ సర్వమతాల సంస్కృతీ ప్రతీకగా వెలుగొందుతోంది కడప పెద్ద దర్గా (అమీన్ పీర్ దర్గా). మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ దర్గాను హిందూ, ముస్లిం, క్రైస్తవులు నిత్యం పెద్ద ఎత్తున దర్శించుకుని ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ఆధ్యాత్మిక సంపదకు, భక్తి శ్రద్ధలకు నిలయమైన మన దేశంలో వెలసిన ఈ దర్గాలో సాహెబ్‌ను దర్శించి విభూది తీర్థం సేవిస్తే సర్వ వ్యాధులు హరిస్తాయని భక్తుల ప్రగాడ విశ్వాసం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో కొలువైన ఈ అమీన్ పీర్ దర్గాను కడప జిల్లా వాసులు పెద్ద దర్గాగా పిలుస్తుంటారు. ఈ పెద్ద దర్గా ప్రాంగణంలో 18 మజార్‌లు కలిగిన దర్గా ఉంది. ఇక్కడ సంవత్సరంలో ప్రతినెలలోనూ గంధం, ఉరుసు ఉత్సవాలు జరుగుతుంటాయి. అందులో 5 దర్గాలకు చెందిన మజార్‌లకు మాత్రమే ప్రత్యేకంగా ఉరుసు ఉత్సావాలను ఘనంగా నిర్వహిస్తుంటారు.
దర్గా చరిత్రను చూస్తే.. ఆస్తానే-యే-ముగ్దుమ్ ఇలాహి ప్రథమ సూఫీ హజ్రత్ ఖ్వాజా సయ్యద్‌షా పీరుల్లా మహమ్మద్ మహ్మదుల్ హుస్సేని చిస్టివుల్ ఖాదీ నాయబ్-యే-రసూల్ (పీరుల్లా హుస్సేన్) సాహెబ్ కర్నాటక ప్రాంతంలోని బీదర్ నుంచి 16వ శతాబ్దంలో కడపజిల్లాలో అడుగుపెట్టారు. 1683లో కడపకు వచ్చిన ప్రవక్త మహమ్మద్ వంశీయుడైన సాహెబ్ నిరాడంబరులు, దైవాంస సంభూతులుగా పేరుగాంచారు.
మతసామరస్యానికి ప్రతీక..
కడపజిల్లా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందంటే అందుకు కారణం అమీన్ పీర్ దర్గాయేనని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రతియేటా జరిగే ఉరుసు ఉత్సవాల్లో మహమ్మదీయ భక్తులతోపాటు హిందువులు, క్రైస్తవులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో…
సాహెబ్ 1716లో అమీన్ పీర్ దర్గాలో జీవ సమాధి అయ్యారు. అప్పట్లోనే పెద్ద దర్గాను ఇక్కడ నిర్మించారు. ఈయన ఇరువురు కుమారుల్లో పెద్ద కుమారుడు ఆరీఫుల్లో హుస్సేనీ కడప పీఠాధిపతి కాగా, మరో కుమారుడు అహమ్మద్ హుస్సేనీ నందలూరు పీఠాధిపతిగా నియమితులయ్యారు. కడప పీఠాధిపతుల మరణానంతరం సాహెబ్ పెద్ద కుమారుడు పీఠాధిపతిగా కొనసాగారు. ఈ పరంపరలో ప్రస్తుతం 11వ పీఠాధిపతి అరీఫుల్లా హుస్సేనీ కొనసాగుతున్నారు.
ఆరీఫుల్లా హుస్సేనీ వారసుడైన హజ్రత్ సూఫీ సర్మస్‌సానీ చిల్లకష్ ఖ్వాజా సయ్యద్‌షా ఆరీఫుల్లా మహమ్మద్ మహమ్ముదుల్ హుస్సేనీసానీ 11వ ఏట ఇంటి నుంచి వెళ్ళి తాడిపత్రి సమీపంలో గుహల్లో 50 సంవత్సరాలు తపస్సు చేశారు. అటు తరువాత కడప సమీపంలోని గండి వాటర్‌వర్క్స్ గుహల్లో 13 సంవత్సరాలు తపస్సు చేశారు.
హుస్సేనీసానీ తపస్సు చేస్తున్నట్లు ఓ మేకలకాపరి గుర్తించాడు. ప్రతిరోజూ ఒక మేక కొండల్లోకి వెళ్లి వస్తుండటాన్ని గమనించిన మేకలకాపరి ఓ రోజు దాన్ని వెంబడించగా, అక్కడ పెద్ద జడలున్న వ్యక్తి తపస్సులో నిమగ్నమై ఉండటాన్ని గమనించాడు. వెంటనే గొర్రెల కాపరిని రాకను పసిగట్టిన హుస్సేనీసానీ ఈ విషయంగనుక బయటపెడితే నీకే అరిష్టమని హెచ్చరించినట్లు చరిత్ర చెబుతోంది.
అలాగే స్వామీ మీరు చెప్పినట్లే చేస్తాను.. నా సందేహాన్ని మాత్రం తీర్చండని గొర్రెలకాపరి హుస్సేనీసానీని అడిగాడట. వెంటనే ఆయన పక్కనే ఉన్న పెద్ద పామును చూపించి దానికి పాలు ఇచ్చి వెళ్తున్నట్లు చెప్పారట. దానికి ఆశ్చర్యపోయిన గొర్రెలకాపరి, తన తల్లికి కంటిచూపు లేదనీ, చూపు తెప్పించమని ఆ స్వామిని ప్రార్థించాడట. దాంతో మేకతోపాటు మీ తల్లిని కూడా ఇక్కడికి తీసుకురమ్మని హుస్సేనీసానీ చెప్పారట.
Comments
Post a Comment