బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు ఎలా చేస్తారు?బతుకమ్మ పండగ వెనుక ఆసక్తికర కథ..

బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు ఎలా చేస్తారు?బతుకమ్మ పండగ వెనుక ఆసక్తికర కథ..





బతుకమ్మ పండుగ తెలంగాణా రాష్ట్రములోని ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది సెప్టెంబరు, అక్టోబరు నెలలు తెలంగాణ ప్రజలకు పండుగల నెలలు. ఈ నెలలలో రెండు పెద్ద పండుగలు జరపబడతాయి. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాలు, కలయకలుతో నిండిపోయుంటుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ, మరియొకటి దసరా (విజయ దశమి). అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక ఈ పండుగ.రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలుపాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే..తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు.. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ.. తెలంగాణ అస్థిత్వం బతుకమ్మలోనే ఉంది.

బతుకమ్మ కథ :
ఓ ముద్దుల చెల్లి, ఆమెకు ఏడుగురు అన్నదమ్ములు. అంతా వీరాధివీరులే. అందరికీ పెళ్ళిళ్లు అయ్యాయి. అన్నలకు చెల్లెలంటే పంచప్రాణాలు. కానీ వదినలకు మాత్రం అసూయ! ఆ బంగారుబొమ్మని బాధపెట్టేవారు. ఓరోజు వేటకెళ్లిన అన్నలు, ఎంతకాలమైనా తిరిగిరాలేదు. అదే అదను అనుకుని వదినలు సూటిపోటి మాటలతో వేధించారు. యాతన తట్టుకోలేక ఆ చెల్లి ఇల్లొదిలి వెళ్లిపోయింది. ఆతర్వాత అన్నలొచ్చారు. ముద్దుల చెల్లి ఎక్కడని.భార్యల్ని నిలదీశారు.విషయం అర్థమైంది. తిండీతిప్పల్లేవు, నిద్రాహారాల్లేవు. చెల్లి కోసం వెదకని పల్లెలేదు, ఎక్కని గుట్టలేదు. ఓ వూరి పొలిమేర దగ్గర బావిలో దాహం తీర్చుకుంటూ ఉండగా … పెద్ద తామరపూవొకటి కనబడింది. వాళ్లను చూడగానే నీళ్లలో తేలుతూ వచ్చేసింది. ఆతర్వాత కొంతసేపటికి ఆ రాజ్యాన్నేలే రాజు వచ్చాడు. ఆ పూవును తీసుకెళ్లి తన తోటలోని కొలనులో వేశాడు. కొలనుచుట్టూ దట్టంగా తంగేడు మొక్కలు మొలిచాయి. కొంతకాలానికి విష్ణుమూర్తి దిగొచ్చి తామరను మనిషిగా చేశాడు.ఆమె శ్రీలక్ష్మి అవతారమని ప్రకటించాడు. పువ్వులకు బతుకుదెర్వు చూపింది కాబట్టి బతుకమ్మ అయ్యింది! ఇదో జానపద గాథ. మహిషాసురుని చంపిన తర్వాత అలసి సొలసి మూర్ఛపోయిన అమ్మవారికి, మహిళలంతా కలిసి పాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నమని మరో ఐతిహ్యం. ఆత్మత్యాగంతో తెలంగాణా ఓ పల్లెను వరద బారినుంచి కాపాడిన త్యాగమూర్తే బతుకమ్మ అనేవారూ ఉన్నారు.అ రోజు నుండి బతుకుమ్మ పేరు లానే ఉంది

తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు : 9రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు, యువతులు పాల్గొంటారు. చివరిరోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈరోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు.
1) ఎంగిలి పూల బతుకమ్మ: మహా అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
2)అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
3)ముద్దపప్పు బతుకమ్మ: ముద్దపప్పు, పాలు, బెల్లం తో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
4) నానే బియ్యం బతుకమ్మ: నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
5)అట్ల బతుకమ్మ: అట్లు  నైవేద్యంగా సమర్పిస్తారు..
6)అలిగిన బతుకమ్మ: ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.
7)వేపకాయల బతుకమ్మ: బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
8)వెన్నముద్దల బతుకమ్మ: నువ్వులు నైవేద్యం తయారు చేస్తారు.
9)సద్దుల బతుకమ్మ: ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్‌ రైస్‌, కొబ్బరన్నం, నువ్వులన్నం.తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. . ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు. ఈ తొమ్మిది రోజులలో వీరు రోజూ బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం వాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు

Comments

Popular posts from this blog

మన రాజు పురుషోత్తముడి చేతిలో దెబ్బతిన్న అలెక్జాండర్

పుస్తకాలు చదవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు